COVID19: బెంగళూరులో పిల్లల్లో పెరుగుతున్న కరోనా కేసులు

  • రెండు వారాల్లోనే 500 మందికి పాజిటివ్
  • రోజువారీ కేసుల్లో 14% 0–19 ఏళ్ల వారే
  • తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సోకుతోందన్న బీబీఎంపీ
Corona Cases In Kids On Raise In Bangalore

మూడో వేవ్ ముప్పు పిల్లలపైనే ఎక్కువగా ఉంటుందన్న ఆందోళనల నేపథ్యంలో బెంగళూరులో కరోనా బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. ఈ రెండు వారాల్లోనే 500 మంది పిల్లలకు కరోనా సోకిందని బృహన్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ (బీబీఎంపీ) అధికారులు చెప్పారు. బడులు తెరిచేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతున్న సమయంలోనే పిల్లల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

బీబీఎంపీ గణాంకాల ప్రకారం.. ఈ కేసుల్లో గత ఐదు రోజుల్లోనే 263 కేసులు వచ్చాయి. కాగా, కరోనా బారిన పడుతున్న వారిలో 0–19 ఏళ్ల మధ్య వారు 14 శాతం ఉన్నారని బీబీఎంపీ స్పెషల్ కమిషనర్ (హెల్త్) రణ్ దీప్ చెప్పారు. జులై చివరి వారంతో పోలిస్తే ఇప్పుడు పిల్లల్లో కేసులు పెరుగుతున్నాయని ఆయన వివరించారు.

ఆసుపత్రుల్లో చేరుతున్న పిల్లల వివరాలనూ ఆరా తీస్తున్నామని ఆయన తెలిపారు. గత పది రోజుల్లో కరోనాతో పిల్లలెవరూ చనిపోలేదన్నారు. తల్లిదండ్రుల నుంచే పిల్లలకు కరోనా సోకుతున్నట్టు ఇటీవలి పరీక్షల్లో తేలిందని చెప్పారు. దాంతో పాటు పిల్లలు బయట ఆడుకొంటున్న సమయంలోనూ కరోనా సోకి ఉండొచ్చని, వారి ద్వారా తల్లిదండ్రులకూ వ్యాపిస్తుండొచ్చని తెలిపారు. పిల్లలకు కరోనా సోకినా లక్షణాలుండట్లేదన్నారు. ఒకవేళ తల్లిదండ్రులు వ్యాక్సిన్ వేసుకుని ఉంటే.. వారికి కరోనా సోకినా లక్షణాలుండవని చెప్పారు.

More Telugu News