నన్ను అరెస్ట్ చేయడం కలలోనే సాధ్యం: మీరా మిథున్

13-08-2021 Fri 11:51
  • దళితులను కించపరిచేలా మీరా వ్యాఖ్యలు 
  • పలు సెక్షన్ల కింద కేసుల నమోదు
  • ఆమెను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం
Arresting me is possible only in dreams says Meera Mithun
దళిత దర్శకులు, నటీనటుల వల్ల తనకు సినీ అవకాశాలు తగ్గిపోయాయని... దళితులను ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని తమిళ హీరోయిన్ మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దళితులను కించపరిచేలా మాట్లాడిన ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు... మరో ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ఈ క్రమంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెకు పోలీసులు నోటీసులు పంపారు. ఈ క్రమంలో నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి మీరా మిథున్ నిన్న వస్తుందని అందరూ భావించారు. అయితే ఆమె రాలేదు. దీంతో, ఆమెను ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం సాగుతోంది.

ఈ నేపథ్యంలో మీరామిథున్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... తన అరెస్ట్ కలలోనే సాధ్యమని వ్యాఖ్యానించింది. సాధ్యమైతే తనను నిర్భయంగా అరెస్ట్ చేసుకోవచ్చని ఛాలెంజ్ చేసింది. తనను అరెస్ట్ చేయడం జరిగే పని కాదని... ఒకవేళ అది జరిగినా కలలోనే సాధ్యమని పేర్కొంది.