తెలుగు రైతు ఉపాధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లునాయుడు.. ఉత్తర్వులు జారీ

13-08-2021 Fri 09:40
  • తెలుగు రైతు విభాగంలో పలు పదవుల భర్తీ
  • టీడీపీ రైతు అధికార ప్రతినిధిగా గొంతిన శ్రీనివాసరావు
  • తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా దాడి ముసిలి అప్పారావు
G mallunaidu appointed as telugu rythu vice president
విశాఖపట్టణం జిల్లా చోడవరానికి చెందిన టీడీపీ సీనియర్ నేత గూనూరు మల్లునాయుడు తెలుగు రైతు ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మల్లునాయుడు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పదవి అప్పగించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రైతు సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ముందుకు సాగుతానని అన్నారు.  

కాగా, టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న మల్లునాయుడు పలు పదవులు చేపట్టారు. తెలుగు యువత అధ్యక్షుడిగానూ పనిచేశారు. చోడవరం మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా, గోవాడ చక్కెర ఫ్యాక్టరీ పాలకవర్గం చైర్మన్‌గా సేవలు అందించారు.

ఇక టీడీపీ రైతు అధికార ప్రతినిధిగా కశింకోట మండలం సోమవరం గ్రామానికి చెందిన గొంతిన శ్రీనివాసరావు, తెలుగురైతు రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శిగా దాడి ముసిలి అప్పారావు, తెలుగు రైతు రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా కొయ్యూరు మండలానికి చెందిన లోతా భీమరాజు నియమితులయ్యారు.