న్యాయమూర్తుల జీవితాలపై సీజేఐ ఎన్వీ రమణ ఆవేదనాభరిత వ్యాఖ్యలు

12-08-2021 Thu 22:18
  • జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ పదవీవిరమణ
  • వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగం
  • జడ్జిల జీవితంపై దురభిప్రాయాలు ఉన్నాయని వెల్లడి
  • జడ్జిల జీవితాలు కష్టంతో కూడుకున్నవని వివరణ
CJI NV Ramana opines on judges life in reality
జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ రిటైర్మెంట్ సందర్భంగా సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ ప్రసంగించారు. జడ్జిలు ఎంతో విలాసవంతంగా జీవిస్తుంటారని చాలామందిలో వుండే దురభిప్రాయాలు చూస్తుంటే ఎంతో బాధ కలుగుతుందని అన్నారు. ఓ వ్యక్తి జడ్జి కావాలంటే ఎన్నో త్యాగాలు చేస్తేనే అది సాకారం అవుతుందని వెల్లడించారు.

జడ్జిలు అయ్యాక ఎన్నో కష్టాలు ఉంటాయని, సమాజంతో ఇతర విషయాల్లో అనుసంధానం తగ్గిపోతుందని, తీవ్రమైన పనిభారంతో బాధపడుతుంటామని వివరించారు. అయినప్పటికీ జడ్జిలు బంగ్లాల్లో ఉంటారని, హాయిగా సెలవులు ఆస్వాదిస్తుంటారని అపోహ పడుతుంటారని వివరించారు. ఓ జడ్జి వారానికి 100 కేసులు విచారించడం ఏమైనా మామూలు విషయం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

"వాదనలు వినాలి, వ్యక్తిగతంగా కేసు గురించి పరిశోధన చేయాలి, ఆపై తీర్పులు రూపొందించాలి. అదే సమయంలో సీనియర్ జడ్జిలు పాలనాపరమైన వ్యవహారాలను కూడా పర్యవేక్షించాలి. కోర్టులకు సెలవుల సమయంలోనూ పనిచేస్తూనే ఉంటాం. కేసులకు సంబంధించిన శోధన, పెండింగ్ కేసుల తీర్పుల రూపకల్పన... ఇలాంటి అంశాలతో ఊపిరి సలపనంత బిజీగా ఉంటాం. అయినప్పటికీ మేం ఏదో సుఖపడిపోతున్నామంటూ ప్రచారాలు చేస్తుండడం మింగుడుపడని విషయం. అయితే, ఇలాంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టడం బార్ అసోసియేషన్ విధి. జడ్జిల జీవితాలు ఎలా ఉంటాయో బార్ అసోసియేషన్ అవగాహన కలిగించాలి" అని సూచించారు.