భారత హాకీ జట్టు కెప్టెన్ కు ఎస్పీగా ప్రమోషన్

12-08-2021 Thu 21:55
  • టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టుకు కాంస్యం
  • జట్టును అద్భుతంగా నడిపించిన మన్ ప్రీత్
  • 41 ఏళ్ల తర్వాత భారత్ కు పతకం
  • పంజాబ్ పోలీసు విభాగంలో డీఎస్పీగా ఉన్న మన్ ప్రీత్
Indian hockey team captain got promotion after clinching bronze in Tokyo Olympics
భారత పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్ లో ఎంతో మెరుగైన ఆటతీరుతో కాంస్యం సాధించడం తెలిసిందే. అనేక మేటి జట్లను ఓడించిన భారత్ టోక్యో క్రీడల్లో మూడోస్థానంలో నిలిచింది. దాంతో స్వదేశంలో భారత హాకీ జట్టు సభ్యులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక, హాకీ జట్టు సారథి మన్ ప్రీత్ సింగ్ కు పంజాబ్ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. మన్ ప్రీత్ ప్రస్తుతం పంజాబ్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో డీఎస్పీగా పనిచేస్తున్నాడు.

అయితే, టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టును అద్భుత రీతిలో నడిపించి, 41 ఏళ్ల తర్వాత భారత్ కు పతకం అందించాడు. ఈ నేపథ్యంలో, మన్ ప్రీత్ కు ప్రమోషన్ ఇస్తున్నామని పంజాబ్ క్రీడల శాఖ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధీ వెల్లడించారు. మన్ ప్రీత్ ఇకపై పంజాబ్ పోలీసు విభాగంలో ఎస్పీ ర్యాంకు అధికారి అని తెలిపారు.