అమరావతిలో గ్రావెల్ తవ్వకాల అంశంపై ఆరా తీసిన ఎస్పీ విశాల్ గున్నీ

12-08-2021 Thu 20:48
  • రాజధానిలో అక్రమ తవ్వకాల కలకలం
  • సీఐ అనుమతిచ్చారంటూ ఆరోపణలు
  • ఓ ఆడియో వైరల్
  • అందులో గొంతు తనది కాదంటున్న సీఐ
  • విచారణకు ఆదేశించిన ఎస్పీ
SP Vishal Gunny looks into Amaravathi illegal mining issue
ఏపీ రాజధాని అమరావతిలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో, ఎస్పీ విశాల్ గున్నీ స్పందించారు. అక్రమ గ్రావెల్ అంశంపై ఆయన ఆరా తీశారు. తవ్వకాలకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల ఫోన్ సంభాషణ వైరల్ అవడంపై ఆయన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం, అడిషినల్ ఎస్పీ స్థాయి అధికారితో దర్యాప్తునకు ఆదేశించారు. వాస్తవాలు తేలితే బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ విశాల్ గున్నీ హెచ్చరించారు.

గ్రావెల్ తవ్వకాలకు అనుమతిస్తూ తుళ్లూరు సీఐ దుర్గాప్రసాద్ ఆ ఆడియోలో మాట్లాడినట్టు ఆరోపణలు రావడం తెలిసిందే. దాంతో, రాజధానిలో అక్రమ తవ్వకాలు అడ్డుకోవాలంటూ రైతులు తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. కంకర కోసం ఏకంగా రోడ్లను తవ్వేస్తూ కంకర మాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, సీఐ దుర్గాప్రసాద్ తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు.

రైతులు చెబుతున్నట్టుగా ఆ ఆడియోలో గొంతు తనది కాదని స్పష్టం చేశారు. అక్రమ తవ్వకాలు చేపడుతున్న వారిపై కేసులు నమోదు చేశామని, విచారణ జరుగుతుందని తెలిపారు. అయితే, రైతులు ఆయనిచ్చిన వివరణకు సంతృప్తి చెందలేదు. పోలీసులపై తమకు నమ్మకంలేదని స్పష్టం చేశారు.