బీజేపీ, వైసీపీ చీకటి స్నేహానికి.. విజయసాయి నియామకమే నిదర్శనం: టీడీపీ నేత ఎన్ఎండీ ఫరూక్

12-08-2021 Thu 15:27
  • పార్లమెంటు పీఏసీ కమిటీలో విజయసాయిని సభ్యుడిగా నియమించారు
  • అనేక ఆర్థిక నేరాల్లో విజయసాయి ఏ2గా ఉన్నారు
  • ప్రజలను వైసీపీ మోసం చేస్తోంది
There is black friendship between BJP and YSRCP says NMD Farooq
కేంద్రంలో ఉన్న బీజేపీతో వైసీపీకి చీకటి స్నేహం కొనసాగుతోందని టీడీపీ నేత, మాజీ మంత్రి ఫరూక్ అన్నారు. పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని సభ్యుడిగా నియమించడమే దీనికి నిదర్శనమని చెప్పారు. అనేక ఆర్థిక నేరాల్లో విజయసాయి ఏ2గా ఉన్నారని... ఆయన బెయిల్ రద్దుపై ఈనెల 13న సీబీఐ కోర్టులో విచారణ కూడా జరగబోతోందని అన్నారు. న్యాయమూర్తులను కించపరుస్తూ మాట్లాడిన వైసీపీ కార్యకర్తలను వెనకేసుకొచ్చిన చరిత్ర విజయసాయిదని చెప్పారు. అలాంటి వ్యక్తిని పీఏసీలో సభ్యుడిగా నియమించడమంటే ప్రజలకు ఏం సంకేతాలను ఇస్తున్నట్టని ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సంబంధం పెట్టుకుంటే అదేదో పెద్ద అపరాధం అయినట్టు వైసీపీ గగ్గోలు పెట్టిందని... ఇప్పుడు అదే కేంద్రంతో వైసీపీ ఎలా అంటకాగుతుందని ప్రశ్నించారు. ఓవైపు బీజేపీతో స్నేహం చేస్తూ, మరోవైపు ముస్లింలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటూ వైసీపీ మోసం చేస్తోందని మండిపడ్డారు.