తనకు ‘ట్రిపోఫోబియా’ ఉందన్న లావణ్య త్రిపాఠీ!

12-08-2021 Thu 14:49
  • బయటపడేందుకు ప్రయత్నిస్తున్నానన్న సొట్టబుగ్గల సుందరి
  • ప్రస్తుతం కాంక్రీట్ జంగిల్ కు దూరంగా ఉన్నానని కామెంట్
  • అభిమానులతో చిట్ చాట్ లో వెల్లడి
Lavanya Tripathi Reveals That She Has Tripophobia
సొట్టబుగ్గలతో తొలి సినిమాతోనే అందరినీ ఫిదా చేసిన ‘అందాల రాక్షసి’కి ఓ సమస్య ఉందట. ఇటీవల అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ లైవ్ చాట్ చేసిన లావణ్య త్రిపాఠి.. తనకున్న సమస్యను చెప్పుకొచ్చింది. తనకు ‘ట్రిపోఫోబియా’ ఉందని చెప్పింది. కొన్ని వస్తువులు, ఆకారాలను చూసినప్పుడు తనకు తెలియకుండానే భయం కలుగుతుందని ఆమె చెప్పింది. ఆ సమస్య నుంచి బయటపడేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నానని స్పష్టం చేసింది.

అంతేగాకుండా ప్రస్తుతం తాను కాంక్రీట్ జంగిల్ కు దూరంగా ప్రకృతిలో సేదతీరుతూ ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతున్నానని ఆమె చెప్పింది. లాక్ డౌన్ లో ఇన్నాళ్లూ ఇంట్లోనే ఉన్న తాను.. ఇప్పుడు వచ్చిన కథలను వింటున్నానని తెలిపింది. మనం సంతోషంగా లేనప్పుడు ఎదుటివారికి ఎలాంటి సంతోషాన్నీ పంచలేమని, తాను ఆ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతానని తెలిపింది. ఎవరికి వారు తమ గురించి విశ్లేషించుకుంటేనే తప్పొప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మన జీవితమూ ఆనందంగా ఉంటుందని అభిమానులకు సూచనలు చేసింది.