శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్​ షా

12-08-2021 Thu 14:00
  • సున్నిపెంట వద్ద స్వాగతం పలికిన ఏపీ మంత్రి వెల్లంపల్లి
  • ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత
  • దర్శనానంతరం భ్రమరాంభ అతిథి గృహంలో భోజనం
Home Min Amit Shah Visits Srisailam
శ్రీశైలం మల్లన్నను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ కు చేరుకున్న ఆయన.. అక్కడి బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో సున్నిపెంటకు చేరుకున్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి, కలెక్టర్, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.


అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునుడి దర్శనార్థం ఆలయానికి వెళ్లారు. ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. దర్శనానంతరం ఆయన భ్రమరాంభ అతిథి గృహానికి చేరుకుని అక్కడే భోజనం చేయనున్నారు. తిరిగి హైదరాబాద్ కు వెళ్లి అక్కడి నుంచి 3.50 గంటలకు ఢిల్లీకి బయల్దేరతారు. కాగా, అమిత్ షా మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం శుభసూచకమని బీజేపీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.