ఆఫ్ఘన్ కు భారత్​ కానుకగా ఇచ్చిన అత్యాధునిక 'ఎటాక్​ హెలికాప్టర్'ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు!

12-08-2021 Thu 13:12
  • ఎంఐ35 హింద్ హెలికాప్టర్ ఆక్రమణ
  • పోతూపోతూ బ్లేడ్లు తీసేసిన ఆఫ్ఘన్ సైన్యం
  • వాటిని అమర్చాలంటే కష్టమంటున్న నిపుణులు
  • దానిని నడపాలంటే అపార అనుభవం అవసరమని కామెంట్
Talibans Captured Indian Gifted Attack Helicopter
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కటిగా అన్ని ప్రాంతాలను ఆక్రమించేసుకుంటున్న తాలిబాన్ ఉగ్రవాదులు.. సైన్యానికి చెందిన ఆస్తులనూ స్వాధీనం చేసుకుంటున్నారు. అడ్డుకున్న వారందరినీ కిరాతకంగా హతమారుస్తున్నారు.

గతంలో ఆఫ్ఘనిస్థాన్ కు భారత్ బహుమానంగా అందజేసిన ‘ఎంఐ35 హింద్’ ఎటాక్ హెలికాప్టర్ ను తాజాగా తాలిబన్లు వశపరచుకున్నారు. కుందూజ్ విమానాశ్రయాన్ని చెరపట్టిన తాలిబాన్లు.. అక్కడి ఆర్మీ హెలికాప్టర్ ను కూడా తమ స్వాధీనంలోకి తీసేసుకున్నారు.

అయితే, దానిని ఆపరేట్ చేయడం అంత సులువు కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. తాలిబన్లు దానిని వాడుతారన్న ఉద్దేశంతో ఆఫ్ఘన్ సైన్యం ముందుగానే ఆ హెలికాప్టర్ రోటర్ బ్లేడ్లను తొలగించింది. ఆ బ్లేడ్లను అక్కడే పెట్టినా.. వాటిని హెలికాప్టర్ కు అమర్చాలంటే మాత్రం సాంకేతికంగా చాలా అనుభవం ఉన్న వారు రావాల్సి ఉంటుందని రక్షణ రంగ నిపుణుడు, విశ్లేషకుడు జోసఫ్ డెంప్సే చెప్పారు.

అంతేగాకుండా దానిని నడపాలన్నా అత్యంత సుశిక్షితులైన సిబ్బంది, అపార అనుభవం అవసరం కావాల్సి ఉంటుందన్నారు. 2019లో ఆఫ్ఘన్ కు మూడు చీతా హెలికాప్టర్లు సహా ఎంఐ35 ఎటాక్ హెలికాప్టర్ ను భారత్ కానుకగా ఇచ్చింది.

కాగా, తాలిబన్లు ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్ లోని 65 శాతం భూభాగాన్ని తమ అధీనంలోకి తెచ్చేసుకున్నారు. దేశ ఈశాన్య ప్రాంతంలో కీలకమైన అన్ని ప్రావిన్స్ లను వారు ఆక్రమించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ను వారి అధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాజధాని కాబూల్ .. ఆర్మీ రక్షణలోనే ఉంది. అయితే, మహా అయితే మరో 30 నుంచి 90 రోజుల్లో దాన్నీ తాలిబన్లు ఆక్రమిస్తారని అమెరికా ఆర్మీ నిపుణులు చెబుతున్నారు. ఈ నెలాఖరునాటికి ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సహా నాటో బలగాలు పూర్తిగా వెనక్కు వెళ్లిపోతాయి.