జానారెడ్డికి పట్టిన గతే ఈటలకు కూడా పడుతుంది: తలసాని శ్రీనివాస్ యాదవ్
- గెల్లు శ్రీనివాస్ ను కేసీఆర్ బానిస అనడం ఈటల అహంకారానికి నిదర్శనం
- ఈటల హుజూరాబాద్ లో బీసీ, శామీర్ పేటలో ఓసీ
- కేసీఆర్ దయతో ఈటల ఆరు సార్లు గెలిచారు
గెల్లును కేసీఆర్ బానిస అని అనడం సరికాదని తలసాని అన్నారు. ఈటల అహంకారానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని మండిపడ్డారు. ఈటల ముందు గెల్లు శ్రీనివాస్ చిన్నవాడే కావచ్చని... ఆనాడు దామోదర్ రెడ్డి ముందు ఈటల కూడా చిన్నవాడేనని తలసాని అన్నారు. ఈటల హుజూరాబాద్ లో బీసీ, శామీర్ పేటలో ఓసీ అని ఎద్దేవా చేశారు.
ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యతను ఇస్తుందని... గతంలో బాల్క సుమన్, కిశోర్ లకు అవకాశం కల్పించినట్టుగానే ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ కు కేసీఆర్ అవకాశం ఇచ్చారని తలసాని చెప్పారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి పట్టిన గతే ఇప్పుడు హుజూరాబాద్ లో ఈటలకు పడుతుందని అన్నారు. కేసీఆర్ దయతోనే ఈటల ఆరు సార్లు గెలిచారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఇష్టానుసారం మాట్లాడటాన్ని బీజేపీ నేతలు మానుకోవాలని సూచించారు.