భార్యతో వివాహేతర సంబంధం.. యువకుడిని కొట్టి చంపిన ఏపీ డీజీపీ వ్యక్తిగత అంగరక్షకుడు

12-08-2021 Thu 08:46
  • కానిస్టేబుల్ నైట్ డ్యూటీకి వెళ్లిన సమయంలో గోడదూకి ఇంట్లోకి ప్రవేశించిన వెంకటేశ్
  • బయటి నుంచి గడియపెట్టిన ఇంటి యజమానులు
  • కానిస్టేబుల్ దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్
  • కానిస్టేబుల్, ఇంటి యజమానిపై కేసు నమోదు
AP DGP Security Guard killied a man over illegal affair with his wife
తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువకుడిని పట్టుకుని కొట్టి చంపిన కేసులో ఏపీ డీజీపీ వ్యక్తిగత అంగరక్షకుడు అరెస్ట్ కావడం సంచలనమైంది. అయితే, ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. విజయవాడ పటమట స్టేషన్ పరిధిలోని రామలింగేశ్వరనగర్‌లోని పుట్ట రోడ్డులో భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్న శివనాగరాజు కానిస్టేబుల్. విజయవాడ సిటీ ఆర్మ్‌డ్ రిజర్వులో పనిచేస్తున్న అతడు డీజీపీకి వ్యక్తిగత అంగరక్షకుడిగా ఉన్నాడు.

కానిస్టేబుల్ నివసిస్తున్న అద్దె ఇంటిపైని పెంట్‌హౌస్‌లో ఉంటున్న మచిలీపట్టణానికి చెందిన వెంకటేశ్ (24)కు కానిస్టేబుల్ భార్యతో పరిచయమైంది. అది మరింత పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలిసిన కానిస్టేబుల్ భార్యను మందలించి హెచ్చరించాడు. ఇంటి యజమానితో చెప్పి వెంకటేశ్‌ను ఇల్లు ఖాళీ చేయించాడు.

అయితే, వెంకటేశ్ ఇల్లు ఖాళీ చేసినప్పటికీ కానిస్టేబుల్ లేని సమయంలో ఇంటికి వచ్చి పోతూ ఉండేవాడు. దీంతో ఆరు నెలల క్రితం భార్యాభర్తల మధ్య మరోమారు గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, పెద్దలు రాజీ కుదర్చడంతో ఈ ఏడాది జూన్‌లో తిరిగి భర్త దగ్గరకు చేరింది.

ఇంత జరిగినా వెంకటేశ్‌తో మాట్లాడడాన్ని ఆమె మానుకోలేదు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కానిస్టేబుల్ నైట్ డ్యూటీకి వెళ్లిపోగా, అదే రోజు విజయవాడ వచ్చిన వెంకటేశ్ అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత గోడ దూకి కానిస్టేబుల్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో అలికిడి కావడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమానులు పైకి వెళ్లారు. వారిని గమనించిన వెంకటేశ్ ఇంట్లోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు. వారు తలుపు తట్టినా తీయకపోవడంతో బయట నుంచి గడియపెట్టి విషయాన్ని శివనాగరాజుకు ఫోన్ చేసి చెప్పారు.

వెంటనే ఇంటికి చేరుకున్న శివనాగరాజు.. వెంకటేశ్‌ను పట్టుకుని కాళ్లు, చేతులు కట్టేసి తీవ్రంగా కొట్టాడు. దీంతో పొరుగింటివారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పటమట పోలీసులు తీవ్రంగా గాయపడిన వెంకటేశ్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కానిస్టేబుల్ శివనాగరాజు సహా ఇంటి యజమానులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.