'పెళ్లి సందD' టైటిల్ సాంగ్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

11-08-2021 Wed 18:33
  • రోషన్ హీరోగా 'పెళ్లి సందD'
  • కథానాయికగా శ్రీలీల పరిచయం
  • ప్రత్యేక పాత్రలో రాఘవేంద్రరావు
  • త్వరలోనే విడుదల  
Pelli Sandadi title song release date and time are comfirmed
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా 'పెళ్లిసందడి' సినిమా రూపొందింది. ఆర్కే ఫిల్మ్స్ - ఆర్కా మీడియా వారు ఈ సినిమాను నిర్మించారు. గౌరీ రోణంకి దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాకి, రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఈ పాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. కానీ కరోనా కారణంగా ఆలస్యమైంది.

కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖాయం చేశారు. రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు, టైటిల్ సాంగ్ ను లిరికల్ వీడియోగా అందించనున్నారు. రోషన్ సరసన నాయికగా శ్రీలీల నటించింది. తెలుగులో ఆమెకి ఇది తొలి సినిమా.

ఇంతవరకూ రాఘవేంద్రరావు సినిమాలో భాగంగా ఎప్పుడూ తెరపై కనిపించలేదు. కానీ ఆయన తొలిసారిగా ఈ సినిమాలో 'వశిష్ఠ' అనే పాత్రలో కనిపించనున్నారు. నటుడిగా ఆయన తొలిసారి తెరపై కనిపించడం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.