ప్రతిరోజు వేలాది మంది అమాయకులు చనిపోతున్నారు... నా దేశాన్ని కాపాడండి: క్రికెటర్ రషీద్ ఖాన్

11-08-2021 Wed 18:27
  • తాలిబన్ దాడులతో అట్టుడుకుతున్న ఆప్ఘనిస్థాన్
  • పిల్లలు, మహిళలు సహా వేలాది మంది చనిపోతున్నారన్న రషీద్ ఖాన్
  • ప్రపంచ నేతలు ఆదుకోవాలని విన్నపం
Cricketer Rashid Khan pledges world leaders to save Afghanistan
తాలిబన్ ఉగ్రవాదుల దాడులతో ఆఫ్ఘనిస్థాన్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘన్ నుంచి అమెరికా, నాటో దళాలు వెనుదిరిగిన వెంటనే ఆ దేశం అగ్నిగుండంలా మారింది. తాలిబన్లు జరుపుతున్న దాడుల్లో దేశ వ్యాప్తంగా ప్రతిరోజు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

పిల్లలు, మహిళలు సహా వేలాది మంది అమాయకులు ప్రతిరోజు చనిపోతున్నారని చెప్పాడు. ప్రజల ఇళ్లు, ఆస్తులు ధ్వంసమవుతున్నాయని తెలిపాడు. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని చెప్పాడు. తన దేశం అల్లకల్లోలంలో ఉందని... ఆఫ్ఘన్ ను ఆదుకోవాలని ప్రపంచ నేతలను కోరాడు. ఆఫ్ఘన్ ప్రజలను చంపడాన్ని అడ్డుకోవాలని విన్నవించాడు. తమకు శాంతి కావాలని చెప్పాడు.