రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న 'రాజ రాజ చోర'

11-08-2021 Wed 18:03
  • హాస్యప్రధానంగా నడిచే కథ
  • ప్రధాన నాయికగా మేఘ ఆకాశ్
  • కీలకపాత్రలో రవిబాబు  
  • ఈ నెల 19వ తేదీన విడుదల    
Raja Raja Chora release date is confirmed
కొత్త కథలకు .. వైవిధ్యభరితమైన పాత్రలకు శ్రీవిష్ణు ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. అలా ఆయన తాజా చిత్రంగా 'రాజ రాజ చోర' రూపొందుతోంది. విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకి, హసిత్ గోలి దర్శకత్వం వహించాడు. హాస్యప్రధానమైన కథాకథనాలతో సాగే ఈ సినిమా ఈ పాటికే విడుదల కావలసింది గానీ, కరోనా కారణంగా వాయిదా పడింది.

మేఘ ఆకాశ్ ప్రధానమైన కథానాయికగా నటించగా, మరో కథానాయికగా సునైన కనిపించనుంది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారనే టాక్ వచ్చింది. ఆ పుకార్లకు తెరదించేస్తూ ఈ సినిమాను ఈ నెల 19వ తేదీన థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ స్పష్టం చేశారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ సినిమాలో హీరో తాను సాఫ్ట్ వేర్ ఉద్యోగినని చెప్పుకుని తిరుగుతూ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ అయిన రవిబాబు, పై అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక ఎవరో ఒకరిపై కేసులన్నీ తోసేయాలనే ప్రయత్నంలో ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే హీరో అతని కంటపడతాడు. తరువాత ఏం జరుగుతుందనేదే అసలు కథ. ఈ సినిమాతో శ్రీవిష్ణుకి హిట్ పడుతుందేమో చూడాలి.