నిర్మాతగా మారిన బాలీవుడ్ భామ!

11-08-2021 Wed 16:16
  • చిత్ర నిర్మాణంలోకి దిగిన కరీనా కపూర్ 
  • ఏక్తా కపూర్ తో కలసి చిత్ర నిర్మాణం
  • హన్సల్ మెహతా దర్శకత్వంలో సినిమా
  • యూకే నేపథ్యంలో సాగే సినిమా కథ
Kareena Kapoor turns producer
నేటి మన కథానాయికలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఓపక్క సినిమాలలో నటిస్తూనే.. మరోపక్క వివిధ రకాల వ్యాపారాలలోకి కూడా ప్రవేశిస్తున్నారు. వీరిలో చాలామంది సక్సెస్ అవుతున్నారు కూడా. అయితే, కథానాయికలు చిత్ర నిర్మాణంలోకి దిగడం మాత్రం తక్కువనే చెప్పాలి. ఇక్కడ రిస్క్ ఎక్కువన్న కారణంతో సాధారణంగా ప్రొడక్షన్ లోకి రావడానికి అంతగా ఆసక్తి చూపారు.

అయితే, ఇందుకు భిన్నంగా ఇప్పుడు బాలీవుడ్ భామ కరీనా కపూర్ నిర్మాతగా మారుతోంది.
ఈ క్రమంలో ఆమె తాజాగా తన తొలి చిత్రాన్ని ప్రకటించింది. మరో నిర్మాత ఏక్తా కపూర్ తో కలసి చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నట్టు కరీనా పేర్కొంది. 'సిటీ లైట్స్', 'అలీఘర్', 'ఒమెర్తా', 'షాహిద్'.. వంటి ప్రశంసలందుకున్న చిత్రాలను రూపొందించిన హన్సల్ మెహతా దీనికి దర్శకత్వం వహిస్తాడు.

కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా అల్లుకున్న కథతో దీనిని యూకే నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. తనకు హన్సల్ సినిమాలంటే చాలా ఇష్టమనీ, ఆయన దర్శకత్వంలో తన తొలి చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉందనీ కరీనా ఈ సందర్భంగా తెలిపింది. ఇందులో ఆమె కీలక పాత్రను పోషిస్తోంది.