15 సంవత్సరాలు ఎన్నో కష్టాలు అనుభవించాను: సింగర్ సునీత

11-08-2021 Wed 15:02
  • మొదటి పెళ్లి అయిన తర్వాత అసలు జీవితం ఏమిటో అర్థమయింది
  • నాకు తగిలిన దెబ్బలకు మనుషులను నమ్మడం కూడా మానేశాను
  • రామ్ లోని నిజాయతీ నాకు ఎంతో నచ్చింది
I faced many problems for 15 years says singer Sunitha
తన మధురమైన గానంతో సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సింగర్ సునీత... ఇటీవలే రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వృత్తి పరంగా ఎంతో సక్సెస్ సాధించిన సునీత... తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో బాధలను అనుభవించారు. తన తొలి భర్తకు దూరమైన చాలా కాలం తర్వాత ఆమె రామ్ ను రెండో వివాహం చేసుకున్నారు. ఈ వివాహాన్ని ఎందరో స్వాగతించినప్పటికీ... కొందరు విమర్శించడం గమనార్హం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను పంచుకున్నారు.

ప్రతి టీనేజ్ అమ్మాయి తన జీవితం గురించి ఎన్నో కలలు కంటుందని సునీత చెప్పారు. తన జీవితం అందమైన నవలలా ఉండాలని కోరుకుంటుందని... తాను కూడా అందరి మాదిరే అలాంటి కలలే కన్నానని తెలిపారు. అయితే, తన మొదటి పెళ్లి తర్వాత తనకు ఎన్నో విషయాలు తెలిసొచ్చాయని చెప్పారు. అసలు జీవితం అంటే ఏమిటనే విషయం అర్థమయిందని అన్నారు. ఆ తర్వాత తన మొదటి పెళ్లి బ్రేకప్ అయిందని... సుమారు 15 ఏళ్ల పాటు ఎన్నో కష్టాలను అనుభవించానని చెప్పారు. తనకు తగిలిన దెబ్బలకు మనుషులను నమ్మడం కూడా మానేశానని తెలిపారు.

ఇక తన భర్త రామ్ చాలా మంచి వ్యక్తి అని సునీత చెప్పారు. పెళ్లి ప్రపోజల్ తో ఆయన తన వద్దకు వచ్చినప్పుడు ఎంతో నిజాయతీగా మాట్లాడారని అన్నారు. పెళ్లి ప్రపోజల్ కు నువ్వు ఒప్పుకుంటే తనకు ఎంతో ఆనందంగా ఉంటుందని... ఒప్పుకోకపోతే చాలా బాధగా ఉంటుందని ఆయన అన్నారని... అయితే, నువ్వు ఒప్పుకోకపోయినా తన జీవితం ఎక్కడా ఆగదని కూడా ఆయన అన్నారని చెప్పారు. ఆయనలోని నిజాయతీ తనకు చాలా నచ్చిందని అన్నారు.

అయితే, డబ్బు కోసమే రామ్ ను తాను పెళ్లి చేసుకున్నానని కొందరు కామెంట్లు చేశారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. తన బాధ్యతలను ఎవరో చూసుకుంటున్నారని కూడా ప్రచారం చేశారని చెప్పారు. అసలు రామ్ కు ఎంత ఆస్తి ఉందో కూడా తనకు తెలియదని అన్నారు. ఆయన కంపెనీ టర్నోవర్ ఎంతో కూడా తనకు తెలియదని చెప్పారు. తమ ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం, పరస్పర గౌరవం వున్నాయని తెలిపారు.