Telangana: ప్రజల గురించి పట్టించుకోని కేసీఆర్​ కు ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదు: షర్మిల మండిపాటు

  • ప్రశ్నిస్తే ఎందుకంత అసహనం?
  • 7,500 కుటుంబాలను రోడ్డున పడేశారు
  • అందరినీ అణచివేస్తున్నారు
  • ఫీల్డ్ అసిస్టెంట్ల ధర్నాకు సంఘీభావం
YS Sharmila Questions Govt Over Field Assistants Problems

ప్రజల గురించి పట్టించుకోని కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. సీఎంను ప్రశ్నించారన్న ఒకే ఒక్క కారణంతో 7,500 కుటుంబాలను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విధానం, నినాదం, సిద్ధాంతమే ప్రశ్నించడమన్న సంగతిని కేసీఆర్ మరచిపోయి అందరినీ అణచివేస్తున్నారని విమర్శించారు.

ఇవాళ హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కాంట్రాక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్లు చేసిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ధర్నాకు సంఘీభావం తెలిపారు. బాధ్యతను మరచిపోయిన కేసీఆర్ కు.. ఆ బాధ్యతను ఫీల్డ్ అసిస్టెంట్లు గుర్తు చేశారని, జీతాలను పెంచాలంటూ సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి వారిని తీసేశారని మండిపడ్డారు. గతంలో సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులనూ ఇదే మాదిరి ఇబ్బందులు పెట్టారన్నారు.

ప్రశ్నిస్తే ఎందుకంత అసహనమంటూ కేసీఆర్ ను ఆమె నిలదీశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకే కేసీఆర్ ను కలిసే అవకాశం లేదని, అలాంటిది ప్రజలను ఎలా మాట్లాడనిస్తారని ఆమె అన్నారు. ప్రజల సమస్యలపై వైఎస్సార్టీపీ పోరాడుతుందని షర్మిల స్పష్టం చేశారు.

More Telugu News