త్రివిక్రమ్ తరువాత రాజమౌళి ప్రాజెక్టు పైకి మహేశ్?

11-08-2021 Wed 12:00
  • సెట్స్ పై 'సర్కారువారి పాట'
  • త్రివిక్రమ్ ప్రాజెక్టుకి సన్నాహాలు
  • కథానాయికగా పూజ హెగ్డే ఖరారు  
  • లైన్లో రాజమౌళి సినిమా    
Mahesh Babu another movie with Rajamouli
ప్రస్తుతం మహేశ్ బాబు 'సర్కారువారి పాట' సినిమా షూటింగుతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగు జరుగుతోంది. ప్రధాన పాత్రధారులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు.

ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ చేయనున్నాడనే సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మొన్న వచ్చేసింది. ఇది భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'అతడు'ను మించి ఉంటుందని అంటున్నారు. పూజ హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయనున్నారు.

ఇక ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలోనే మహేశ్ చేయనున్నాడనే టాక్ క్రమేణ బలపడుతోంది. రాజమౌళి సినిమాకు బల్క్ గా డేట్స్ ఇవ్వవలసి ఉంటుంది. అది పూర్తయ్యేవరకూ మరో సినిమా చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అందువలన వేరే ప్రాజెక్టులను మహేశ్ లైన్లో పెట్టడం లేదని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.