అవును.. ఆక్సిజన్​ అందక ఏపీలో ‘కొందరు’ చనిపోయారు: కేంద్రం ప్రకటన

11-08-2021 Wed 11:58
  • రాజ్యసభలో టీడీపీ ఎంపీ ప్రశ్నకు సమాధానం
  • ఆక్సిజన్ రీఫిల్లింగ్ చేసేలోపే ఘటన జరిగింది
  • ఆ గ్యాప్ లోనే విషాదం జరిగింది
Center Clarifies AP Has Some Oxygen Related Deaths
దేశంలో ఎవరూ ఆక్సిజన్ కొరతతో చనిపోలేదని రెండు నెలల క్రితం చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీలో మాత్రం కొందరు చనిపోయారంటూ తాజాగా ప్రకటించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కొల్లు రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారీ ప్రవీణ్ పవార్ సమాధానమిచ్చారు.

‘‘అవును, ఆక్సిజన్ అందక ‘కొందరు’ చనిపోయినట్టు ఏపీ ప్రభుత్వం చెప్పింది. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఘటన జరిగింది. 10 కిలోలీటర్ల సామర్థ్యమున్న ఆక్సిజన్ ట్యాంక్ రీఫిల్లింగ్, బ్యాకప్ సరఫరాను అందుబాటులోకి తీసుకువస్తున్న టైంలోనే ఘటన జరిగినట్టు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. ఆ గ్యాప్ లోనే ఆక్సిజన్ పీడనం తగ్గిపోయి ఘటనకు కారణమైందని అందులో చెప్పారు’’ అని ఆమె జవాబిచ్చారు.

కాగా, ఈ ఏడాది మేలో సెకండ్ వేవ్ లో ఈ ఘటన జరిగింది. 11 మంది కరోనా పేషెంట్లు ఆక్సిజన్ అందక మరణించారు. ఘటన సమయంలో ఆసుపత్రి మొత్తం పేషెంట్ల బంధువుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. దాదాపు 45 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరాను ఆపేశారంటూ వారు ఆరోపించారు. అయితే, చిత్తూరు కలెక్టర్ మాత్రం.. కేవలం ఐదు నిమిషాలే ఆక్సిజన్ సరఫరాలో ఆటంకం ఏర్పడిందని చెప్పుకొచ్చారు.