ఉత్కంఠను రేపుతున్న 'చతుర్ ముఖం' ట్రైలర్!

11-08-2021 Wed 10:24
  • మలయాళంలో హిట్ కొట్టిన సినిమా
  • ప్రధాన పాత్రధారిగా మంజు వారియర్
  • సౌత్ లో తొలి టెక్నో హారర్
  • ఈ నెల 13 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్    
Chathur Mukham movie trailer released
మలయాళ సినిమాలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. అదే సమయంలో వాళ్లు వైవిధ్యానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఈ కారణంగానే ఈ మధ్య కాలంలో తెలుగులో మలయాళ సినిమాలు రీమేక్ అవుతున్నాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై కూడా వాటి అనువాదాల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ మంచి రెస్పాన్స్ ను రాబడుతున్నాయి.

తెలుగు ఓటీటీ 'ఆహా' ద్వారా 'చతుర్ ముఖం' సినిమా పలకరించనుంది .. ఇది కూడా మలయాళ సినిమాకి తెలుగు అనువాదమే. మంజు వారియర్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి యూ ట్యూబ్ వేదికగా ట్రైలర్ ను వదిలారు.

ఆధునిక ఆలోచనలు .. స్వతంత్ర భావాలు కలిగిన ఒక యువతి, తన కాళ్లపై నిలబడి తన కలలను నిజం చేసుకుంటూ ఉంటుంది. మూఢనమ్మకాలకు ఆమె చాలా దూరం. అలాంటి ఆ యువతి జీవితంలో హఠాత్తుగా కొన్ని చిత్రమైన సంఘటనలు చోటు చేసుకోవడంపై కట్ చేసిన ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సౌత్ ఇండియాలో తొలి టెక్నో హారర్ గా చెబుతున్న ఈ సినిమా, అడుగడుగున థ్రిల్ కలిగించేలానే ఉంది.