Kadapa District: పులివెందులలో లాకప్‌డెత్ కలకలం.. రాత్రికి రాత్రే మృతదేహం దహనం!

News about lockup death in pulivendula police denied
  • దొంగతనం కేసులో పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి చిత్ర హింసలు పెట్టినట్టు ఆరోపణలు
  • స్థానిక నాయకుడి సాయంతో పంచాయితీ చేసినట్టు వార్తలు
  • ప్రచారం అబద్ధమన్న డీఎస్పీ
  • అనారోగ్యంతోనే చనిపోయాడని వివరణ

కడప జిల్లా పులివెందుల పోలీసులు దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన ఓ యువకుడు పోలీస్ స్టేషన్‌లో మృతి చెందినట్టు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే మృతదేహాన్ని దహనం చేయడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే యువకుడు చనిపోయాడన్న ప్రచారం జరుగుతుండగా, అలాంటిదేమీ లేదని పోలీసులు చెబుతున్నారు. పులివెందుల అహోబిళపురం కాలనీకి చెందిన వల్లెపు అశోక్ అలియాస్ అక్కులప్ప (25) తల్లి కువైట్‌కు వలస వెళ్లగా, తండ్రి చిన్నప్పుడే మరణించాడు. అక్కులప్పకు ఓ సోదరి కూడా ఉంది.

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్న అక్కులప్ప అక్కడే ఉంటున్నాడు. అతడిపై పలు దొంగతనం కేసులు ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఓ దొంగతనం కేసులో అక్కులప్పను అనుమానించిన పులివెందుల పోలీసులు ఆదివారం అతడిని తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. ఆ తర్వాత అతడు చనిపోయాడు. పోలీసులు అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్లే చనిపోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అయితే, విషయం బయటకు రాకుండా స్థానిక నాయకుడి సాయంతో అక్కులప్ప కుటుంబ సభ్యులతో పంచాయితీ నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని రాత్రికి రాత్రే స్థానిక హిందూ శ్మశాన వాటికలో దహనం చేసినట్టు సమాచారం. తొలుత పూడ్చిపెట్టాలని భావించి గుంత తవ్వినా ఆ తర్వాత దహనం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు ముందు అశోక్ సోదరితో పోలీసులు సంతకాలు తీసుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారంపై స్పందించిన డీఎస్పీ శ్రీనివాస్ అశోక్‌ది లాకప్ డెత్ కాదని, అనారోగ్యంతోనే మృతి చెందాడని తెలిపారు. ఈ మేరకు అతడి చెల్లెలు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చిందన్నారు. అయితే, ఈ లాకప్‌డెత్‌పై విచారణ జరిపించాలని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ చంద్రశేఖర్ యాదవ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News