హుజూరాబాద్ ఓటర్లకు టీఆర్ఎస్ లేఖలు.. 2 లక్షలకుపైగా ముద్రణ

11-08-2021 Wed 09:39
  • లేఖలో వివిధ పథకాల ప్రస్తావన
  • ఏడేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాల ప్రస్తావన
  • వివిధ పథకాల లబ్ధిదారులతోపాటు వారి కుటుంబ సభ్యులకు కూడా లేఖలు
TRS Ready To Write Letters To Huzurabad people
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పథకాలను నియోజకవర్గ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భావిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అందు కోసం రెండు లక్షలకు పైగా లేఖలు సిద్ధం చేస్తోంది. పార్టీ కలర్ అయిన గులాబీ రంగుతో వీటిని ముద్రిస్తోంది.

గత ఏడు సంవత్సరాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి, రైతుబంధు, బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, విదేశీ విద్యానిధి తదితర వాటిని అందులో వివరిస్తోంది. ఈ పథకాల లబ్ధిదారులతోపాటు వారి కుటుంబ సభ్యులు, నియోజకవర్గంలోని ఇతర కుటుంబాలకు కూడా ఈ లేఖలను పంపనుంది.

అలాగే, నియోజకవర్గంలో చేపట్టిన ఇతర అభివృద్ధి కార్యక్రమాల వివరాలను కూడా ఈ లేఖల్లో జోడిస్తున్నారు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ పర్యటనకు ముందే ఈ లేఖలను నియోజకవర్గ ప్రజలకు పంపనున్నారు. ఇవన్నీ చూశాక ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని టీఆర్ఎస్ ఆ లేఖల్లో ఓటర్లను అభ్యర్థించనుంది.