YS Jagan: వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్టు సాక్షి టీవీలో వచ్చింది.. ఆ విషయం మీకెవరు చెప్పారు?: ‘సాక్షి’ విలేకరిని ప్రశ్నించిన సీబీఐ

CBI questions Sakshi Journalist over ys viveka murder case
  • అప్పట్లో కడప జిల్లా బ్యూరో ఇన్‌చార్జ్‌గా పనిచేసిన బాలకృష్ణారెడ్డిని విచారించిన సీబీఐ
  • తనకు, టీవీకి సంబంధం లేదని వివరణ
  • అవినాష్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శులు సహా 12 మందిని ప్రశ్నించిన సీబీఐ
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో జోరు పెంచిన సీబీఐ అధికారులు నిన్న సాక్షిపత్రిక విలేకరిని ప్రశ్నించినట్టు తెలిసింది. వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్టు అప్పట్లో సాక్షి మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లా బ్యూరో ఇన్‌‌చార్జ్‌ బాలకృష్ణారెడ్డిని సీబీఐ విచారించింది. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.

వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినట్టు సాక్షి టీవీ చానల్‌లో ప్రసారమైందని, ఈ విషయాన్ని మీకెవరు చెప్పారని బాలకృష్ణారెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ తనకు, టీవీకి సంబంధం లేదని, తాను పత్రికకు మాత్రమే పనిచేస్తానని చెప్పినట్టు సమాచారం. కాగా, సీబీఐ అధికారులు నిన్న 12 మంది అనుమానితులను విచారించారు. వీరిలో వైఎస్ అవినాష్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శులు రాఘవరెడ్డి, రమణారెడ్డి, అప్పటి పులివెందుల అర్బన్ సీఐ శంకరయ్య, హోంగార్డు నాగభూషణంరెడ్డి, సాక్షి పత్రిక బ్యూరో ఇన్‌చార్జ్ బాలకృష్ణారెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లా, మల్లి, చెన్నకేశవ, రహమ్తుల్లా ఖాన్, ఉమాశంకర్‌రెడ్డి, అంజిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి ఉన్నారు.
YS Jagan
Sakshi Media
YS Vivekananda Reddy
Murder Case

More Telugu News