చంద్రబాబును కలిసిన జ్యోతిశ్రీ, జనార్దన్.. అండగా ఉంటామన్న టీడీపీ అధినేత

11-08-2021 Wed 07:42
  • సోషల్ మీడియాలో జగన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ వీరిపై కేసులు
  • ’బాబు’ను కలిసి వివరించిన బాధితులు
  • అమరావతి రైతు నేతలు, టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
jyothi sri and janardhan met with chandrababu
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బొల్లినేని జ్యోతిశ్రీ, బుడంపాడుకు చెందిన జనార్దన్ నిన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబును కలిశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఇటీవల వీరిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలిసిన వీరు.. తమపై పెట్టిన కేసుల గురించి వివరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. అక్రమ కేసులపై టీడీపీ పోరాడుతుందని వారికి హామీ ఇచ్చారు. అలాగే, ఇటీవల ఢిల్లీ వెళ్లి వివిధ పార్టీల నేతలను కలిసి అమరావతి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరిన రైతు నేతలు కూడా చంద్రబాబుతో సమావేశమయ్యారు.

మరోపక్క, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల నేతలు నిమ్మకాయల చినరాజప్ప, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆరుమిల్లి రాధాకృష్ణ, కూన రవికుమార్, పరిటాల సునీత, శ్రీరామ్ తదితరులు కూడా చంద్రబాబుతో నిన్న భేటీ అయ్యారు.