సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

11-08-2021 Wed 07:32
  • ఎంగేజ్ మెంట్ జరిగిందన్న నయన్!
  • కథా చర్చల్లో అల్లు అర్జున్ 'ఐకాన్'
  • పిరీడ్ డ్రామాగా ధనుష్ సినిమా  
Nayanatara admits that she got engaged to Vighnesh
*  తమిళ చిత్ర దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రముఖ కథానాయిక నయనతార ప్రేమలో పడడం.. గత కొంతకాలంగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ వార్తలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నయనతార ఒక టీవీ ఇంటర్వ్యూలో తన పెళ్లి విషయాన్ని ప్రస్తావించింది. విఘ్నేశ్ తో తనకు నిశ్చితార్థం జరిగిందని నయన్ వెల్లడించింది. సో.. త్వరలోనే వీరి వివాహం జరుగుతుందని సమాచారం.
*  స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు 'ఐకాన్' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి. త్వరలోనే హీరోకి మొత్తం స్క్రిప్ట్ వినిపించడం జరుగుతుందని తెలుస్తోంది. 'పుష్ప' తరువాత బన్నీ ఈ 'ఐకాన్' చిత్రాన్ని చేస్తాడని అంటున్నారు.
*  తమిళ కథానాయకుడు ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. ఈ చిత్రాన్ని గతకాలపు మద్రాస్ నగర వాతావరణంలో పిరీడ్ డ్రామాగా తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.