ఇంద్రవెల్లి సభతో కేసీఆర్‌కు పోడు భూముల సమస్య గుర్తొచ్చింది: సీతక్క

11-08-2021 Wed 07:03
  • ఇంద్రవెల్లి సభపై టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టిన సీతక్క
  • దళిత గిరిజనులకు ఇందిరాగాంధీ భూములిస్తే కేసీఆర్ వాటిని లాక్కున్నారు
  • మరియమ్మ లాకప్‌డెత్‌పై కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే
Mulugu mla seethakka slams kcr
హుజూరాబాద్ ఉప ఎన్నికతో దళితబంధు పథకం వస్తే, ఇంద్రవెల్లి సభతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పోడు భూముల సమస్య గుర్తొచ్చిందని కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిన్న ఇతర సీనియర్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన సీతక్క.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన దళిత, గిరిజన సభపై టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.

ప్రజలు రేవంత్‌రెడ్డిని మర్చిపోయారన్న టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రేవంత్‌ను ప్రజలు మర్చిపోలేదని, ఫాం హౌస్‌లో ఉన్న కేసీఆర్‌నే మర్చిపోయారని అన్నారు. దళిత గిరిజనులకు ఇందిరాగాంధీ భూములిస్తే కేసీఆర్ వాటిని లాక్కున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పోడుభూములపై గిరిజనులకు హక్కు కల్పించారన్నారు. దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్‌పై కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్న సీతక్క.. పోలీసులు అడ్డుకున్నా ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.