గతంలో బ్రెయిన్ ట్యూమర్ కు 11 సర్జరీలు, ఇప్పుడు కరోనా... ఓ మలయాళ నటి విషాదాంతం

10-08-2021 Tue 18:36
  • నటి శరణ్య శశి కన్నుమూత
  • పదేళ్ల కిందట బ్రెయిన్ ట్యూమర్
  • ఆదుకున్న చిత్ర పరిశ్రమ
  • ఇటీవల కరోనా పాజిటివ్
  • న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరిక
  • చికిత్స పొందుతూ మృతి
Malayalam actress Saranya Sasi dies of post corona problems
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం అలముకుంది. నటి శరణ్య శశి మృతి చెందారు. ఆమె వయసు 35 సంవత్సరాలు. ఇటీవలే శరణ్య శశి కరోనా బారినపడ్డారు. ఆపై న్యూమోనియా, రక్తంలో సోడియం స్థాయి పడిపోవడంతో ఆసుపత్రిపాలయ్యారు. కొన్నిరోజుల చికిత్స అనంతరం కరోనా నెగెటివ్ వచ్చినా, ఇతర అనారోగ్యాలు ఆమెను మృత్యుముఖంలోకి నెట్టాయి. శరణ్య శశి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరణించింది.

పలు సినిమాలు, టీవీ సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకున్న శరణ్య శశి పదేళ్ల కిందట బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడ్డారు. చికిత్సలో భాగంగా వైద్యులు ఆమెకు 11 పర్యాయాలు ఆపరేషన్ చేశారు. ఓ దశలో ఆమె చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర ఇబ్బందులకు గురికావడంతో మలయాళ చిత్ర పరిశ్రమ ఆదుకుంది. కానీ, కరోనా రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఆమె మృతి పట్ల చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.