'ప్రేమిస్తే'.. ఇదిగో ఇలా పిచ్చివాడయ్యాడు!

10-08-2021 Tue 17:52
  • తమిళనాడులో ఘటన
  • కుటుంబ పోషణకు కోయంబత్తూరు వెళ్లిన యువకుడు
  • కేరళ అమ్మాయితో ప్రేమ
  • ఆమెను తీసుకెళ్లిన బంధువులు
  • 21 ఏళ్లుగా కేరళ యువతి కోసం నిరీక్షణ
Tamilandu man lost his mental balance after lover left him forcefully
కొన్నేళ్ల కిందట తెలుగులో 'ప్రేమిస్తే' అనే తమిళ్ డబ్బింగ్ చిత్రం వచ్చింది. అందులో భరత్, సంధ్య ప్రధానపాత్రల్లో నటించారు. ప్రేమించుకున్న వారిద్దరూ మరో ప్రాంతానికి వెళ్లి కలిసి జీవిస్తుంటారు. కానీ హీరోయిన్ తరఫు బంధువులు వచ్చి ఆమెను తీసుకెళ్లిపోతారు. దాంతో హీరో మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై పిచ్చివాడిలా తిరుగుతుంటాడు. ఇప్పుడదే సీన్ తమిళనాడులో చోటుచేసుకుంది.

40 ఏళ్ల నాగరాజన్ పుదుకోట్టై జిల్లా మూలక్కుడి గ్రామవాసి. 21 సంవత్సరాల కిందట కుటుంబ పోషణ కోసం కోయంబత్తూరు వెళ్లాడు. అక్కడ ఓ కిరాణాషాపులో పనిచేస్తూ కుటుంబానికి డబ్బులు పంపించేవాడు. ఆ సమయంలో ఓ కేరళ యువతి పరిచయం కాగా, ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆ కేరళ అమ్మాయి కూడా నాగరాజన్ ను ప్రేమించింది. దాంతో ఆమెను నాగరాజన్ తన గ్రామానికి తీసుకొచ్చాడు. అయితే, ముందుగా తోబుట్టువుల పెళ్లి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని, ఆ తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని కేరళ యువతిని ఒప్పించాడు.

ఇదే సమయంలో, కేరళ యువతి తల్లిదండ్రులు, బంధువులు విషయం తెలుసుకుని, మూలక్కుడి గ్రామానికి వచ్చి ఆమెను బలవంతంగా తమతో తీసుకెళ్లిపోయారు. దాంతో నాగరాజన్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఏనాటికైనా తన కోసం ప్రియురాలు వస్తుందని భావించి రోడ్డుపైనే ఎదురుచూస్తుండేవాడు. ప్రతి నిమిషం ఆమె కోసమే ఆలోచిస్తూ బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాడు.

కొంతకాలం తర్వాత ఊరికి కొంతదూరంలో ఓ గుట్టపై చిన్న గుడిసె ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్నాడు. నాగరాజన్ ఎవరితోనూ మాట్లాడడు. తల్లి వచ్చి ఆహారం అందిస్తుంటుంది. కాగా, ఈ విషయం తెలుసుకున్న పుదుకోట్టై జిల్లా అధికారులు చలించిపోయారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సాయంతో మూలక్కుడి గ్రామానికి వచ్చి అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం మామూలు మనిషి అవుతాడని భావిస్తున్నట్టు అధికార వర్గాలంటున్నాయి.

కాగా, ప్రేమిస్తే సినిమాలో క్లైమాక్స్ ఏంటంటే... ప్రియుడి నుంచి బంధువులు తీసుకెళ్లిన తర్వాత ప్రియురాలు పెళ్లి చేసుకుని పిల్లలు, భర్తతో లైఫ్ లో సెటిలైపోతుంది. అయితే, ఒకరోజు రోడ్డుపై పిచ్చివాడిలా తిరుగుతున్న ప్రియుడ్ని చూసి భర్తతో చెప్పగానే, అతడు సహృదయంతో ఆమె ప్రియుడ్ని కూడా తమతో తీసుకువచ్చేందుకు అంగీకరిస్తాడు.