కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం... ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రకటించిన ఎన్నికల సంఘం

10-08-2021 Tue 16:12
  • 2022 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారికి అవకాశం
  • గతంలో నమోదు చేయించుకోని వారికీ చాన్స్
  • నవంబరు 1న ముసాయిదా ఓటరు జాబితా విడుదల
  • వచ్చే ఏడాది జనవరి 5న తుది జాబితా
New voter registration program announced by election commission
కొత్తగా ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. తాజాగా ప్రత్యేక సవరణ నోటిఫికేషన్ ను జారీ చేసింది. 2022 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీయువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. గతంలో ఓటర్లుగా నమోదు చేసుకోని వారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు ఏపీకి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో కె.విజయానంద్ ఓ ప్రకటన విడుదల చేశారు.

అక్టోబరు 31వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితా పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నవంబరు 1న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు.  నవంబరు 20, 21 తేదీల్లో ఓటర్ల నమోదుపై విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు.

నవంబరు 30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని, డిసెంబరు 20 నాటికి అభ్యంతరాల పరిశీలన పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి 5న తుది జాబితా విడుదల చేస్తామని విజయానంద్ వివరించారు.