రాష్ట్రంలో 3.50 లక్షల మగ్గాల కార్మికులు ఉంటే.. 69 వేల మందికే సాయం చేస్తారా?: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల   

10-08-2021 Tue 13:15
  • వైయస్సార్ నేతన్న నేస్తం నగదును బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం
  • ఇది నేస్తం కాదు, మోసం అన్న నిమ్మల
  • నేతన్నలకు పంచ ఊడబీకి, గోచీ ఇచ్చారని మండిపాటు
AP govt giving funds to only 69000 weavers says Nimmala Rama Naidu
ఏపీ ప్రభుత్వం ఈరోజు వైయస్సార్ నేతన్న నేస్తం ద్వారా చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించింది. అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జగన్ మీట నొక్కి నేరుగా నగదు బదిలీ చేశారు. ఒక్కొక్క కుటుంబానికి రూ. 24 వేల వంతున సాయాన్ని అందించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు.

ఈ పథకం నేతన్నకు నేస్తం కాదని... మోసం అని నిమ్మల మండిపడ్డారు. రాష్ట్రంలో 3.50 లక్షల మగ్గాల కార్మికులు ఉంటే కేవలం 69 వేల మందికే ఈ పథకాన్ని ఇస్తున్నారని... ఇది నేస్తమా? మోసమా? అని ప్రశ్నించారు. చేనేత కుటుంబాలకు ప్రతి ఏటా రూ. 50 వేలు వచ్చే ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఎత్తేయడం సంక్షేమమా? అని నిలదీశారు. చేనేత కార్మికులకు పంచ ఊడబీకి, గోచీ ఇచ్చారని మండిపడ్డారు. నేతన్నలకు ఓ వైపు అన్యాయం చేస్తూ... మరోవైపు ఆర్భాటపు ప్రచారాలు చేసుకుంటున్నారని విమర్శించారు. పాలకొల్లు మండలం దగ్గులూరులో చేనేత కార్మికులతో కలిసి నిమ్మల రామానాయుడు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.