వైయస్సార్ నేతన్న నేస్తం లబ్ధిదారులకు నగదు జమ చేసిన సీఎం జగన్

10-08-2021 Tue 12:31
  • ఒక్కో చేనేత కుటుంబానికి రూ. 24 వేల సాయం
  • 80 వేల చేనేత కుటుంబాలకు లబ్ధి
  • వరుసగా మూడో ఏడాది నేతన్న నేస్తం సాయం 
  • అవినీతి, వివక్షకు తావు లేకుండా డబ్బు నేరుగా ఖాతాల్లోకి జమ చేస్తున్నామన్న సీఎం
Jagan releases YSR Nethanna Nestham funds
వైయస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హత కలిగిన చేనేత కుటంబాలకు ఏపీ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ. 24 వేల చొప్పున ఆర్థిక సాయం అందించింది. తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి ఈ డబ్బును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా 80 వేల చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. వరుసగా మూడో ఏడాది నేతన్న నేస్తం ద్వారా సాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో చేనేత కుటుంబానికి రూ. 24 వేల చొప్పున ఇస్తున్నామని జగన్ తెలిపారు. మూడో విడత కింద రూ. 192.08 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు.

అవినీతి, వివక్షకు తావు లేకుండా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేస్తున్నామని తెలిపారు. అర్హత ఉండి కూడా జాబితాలో పేరు లేని వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. నేతన్నలకు భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.