Supreme Court: అభ్యర్థిత్వం ఖరారైన 48 గంటల్లోగా పార్టీలు వారి నేరచరిత్రను వెల్లడించాలి: తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

Supreme Court Observes That Criminals In Politics Raising At Alarming Rate
  • రాజకీయాల్లో నేరస్థులు పెరుగుతున్నారని కామెంట్
  • నాలుగు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎక్కువయ్యారని వెల్లడి
  • 2019లో 43% మందిపై కేసులున్నాయన్న న్యాయమూర్తి
రాజకీయాల్లో నేరస్థులు పెరిగిపోవడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దాదాపు సగం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అన్ని రాజకీయపార్టీలూ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన 48 గంటల్లోగా వారి నేర చరిత్రను వెల్లడించాల్సిందేనని ఆదేశించింది.

అభ్యర్థుల నేర చరిత్రను ప్రకటించి పత్రికల్లో ప్రచురించాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయని రాజకీయపార్టీలపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలైంది. ఆ వ్యాజ్యాన్ని ఇవాళ జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ బి.ఆర్. గవాయిల ద్విసభ్య ధర్మాసనం విచారించింది. గత ఏడాది ఫిబ్రవరి 13న ఇచ్చిన తీర్పును సవరించింది. అభ్యర్థిత్వం ఖరారైన 48 గంటల్లోపు లేదా నామినేషన్ వేయడానికి 2 వారాల ముందు అభ్యర్థుల నేర చరిత్రను వెల్లడించాలని ఆనాడు ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.

తాజాగా ఆ తీర్పును సవరిస్తూ.. అభ్యర్థిత్వం ఖరారైన 48 గంటల్లోపే వెల్లడించాలని తేల్చి చెప్పింది. అన్ని పార్టీలూ తప్పకుండా ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. గత నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు ఎక్కువైపోయారని జస్టిస్ నారీమన్ చెప్పారు. 2004లో 24 శాతం మంది అభ్యర్థులపై నేరచరిత్ర ఉండగా.. 2009లో 30 శాతం, 2014లో 34%, 2019 ఎన్నికల్లో 43 శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయని ఆయన గుర్తు చేశారు. ఆ కేసులన్నీ పెండింగ్ లోనే ఉన్నాయన్నారు.
Supreme Court
Politics
Criminals
Candidates

More Telugu News