ముడుపుల కోసం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసిన వ్యవసాయాధికారి.. వలపన్ని అరెస్టు చేసిన ఏసీబీ!

10-08-2021 Tue 09:06
  • భద్రాద్రి కొత్తగూడెంలో ఘటన
  • ప్రతి దుకాణదారుడు రూ. 15 వేలు లంచం ఇవ్వాలంటూ మెసేజ్‌లు
  • ఏసీబీకి ఫిర్యాదు చేసిన వ్యాపారులు 
ACB Arrested Mandal Agriculture Officer in Bhadradri Kothagudem dist
ఏ నెలలో ఎవరు ఎంతెంత ముడుపులు చెల్లించుకోవాలో చెబుతూ ఏకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి మరీ లంచాలు వసూలు చేస్తున్న మండల వ్యవసాయాధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో నార్లపాటి మహేశ్‌చందర్‌ ఛటర్జీ 8 సంవత్సరాలుగా మండల వ్యవసాయాధికారి (ఏవో)గా పనిచేస్తున్నారు.

 లంచాల రుచిమరిగిన ఆయన ఎరువులు, పురుగుమందుల దుకాణాల యజమానుల నుంచి ముడుపులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తాను తనిఖీలు నిర్వహించకుండా ఉండాలంటే నెల నెలా ముడుపులు సమర్పించుకోవాలంటూ ఏకంగా వాట్సాప్ గ్రూపునే ఏర్పాటు చేశారు. ఈ నెలలో ప్రతి దుకాణం రూ. 15 వేల చొప్పున ఇవ్వాలంటూ మెసేజ్‌లు పంపారు. ఆయన వేధింపులు భరించలేని వ్యాపారులు గత నెల 30న ఏసీబీకి ఫిర్యాదు చేశారు.

ఏసీబీ అధికారుల సలహా మేరకు ఆరు దుకాణాల నుంచి సేకరించిన సొమ్మును తీసుకునేందుకు రావాలంటూ దుకాణదారులు ఏవోను కోరారు. నిన్న చంద్రుగొండ రైతు వేదికలో యజమానుల నుంచి రూ. 90 వేల లంచం సొమ్ము తీసుకుంటుండగా వల పన్నిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదే సమయంలో అశ్వారావుపేటలోని ఆయన స్వగృహంలోనూ సోదాలు నిర్వహించారు. ఏవోపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.