జూ చూసేందుకు వచ్చి కుమ్మేసుకున్నారు.. వీడియో వైరల్!

10-08-2021 Tue 06:58
  • చైనా రాజధాని బీజింగ్‌లో ఘటన
  • జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు
  • ఆ తర్వాత నుంచి జంతువులూ అలాగే ప్రవర్తిస్తున్నాయన్న జూ అధికారులు
biffo at the Beijing wild animal zoo between a couple of families
జూ సందర్శన కోసం వచ్చిన పర్యాటకుల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. చివరికి రెండు కుటుంబాలు కలబడి కొట్టుకున్నాయి. చైనా రాజధాని బీజింగ్‌లోని వైల్డ్‌లైఫ్ పార్క్‌లో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూ సందర్శనలో పర్యాటకులు బిజీగా ఉన్న వేళ ఇద్దరి మధ్య మొదలైన వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది. అది క్రమంగా ఇరు కుటుంబాలు కలబడే స్థాయికి వెళ్లింది. ఇరు వర్గాల్లోని మహిళలు జుట్లు పట్టుకుని నేలపై పడి కొట్టుకున్నారు.

చేతిలో చంటి బిడ్డతో ఉన్న ఓ మహిళ నేల మీద పడివున్న మహిళ జుట్టు పట్టుకుని లాగుతుండగా, మరో వ్యక్తి వచ్చి చంటి పిల్లాడితో ఉన్న మహిళను బలంగా తన్నాడు. దీంతో ఆమె అల్లంత దూరంలో ఎగిరిపడింది. గొడవ చల్లారకపోగా, మరింత పెద్దది అవుతుండడంతో కల్పించుకున్న జూ సిబ్బంది ఇరు వర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపు చేశారు. వీరి గొడవను జంతువులు కూడా చూస్తూ ఉండిపోయాయని, రాత్రివేళ అవి కూడా మనుషులను అనుకరిస్తూ గొడవకు దిగుతున్నాయని జూ యాజమాన్యం పేర్కొనడం కొసమెరుపు.