వివేకా హత్యకేసు: మూడో రోజు ముగిసిన ఆయుధాల అన్వేషణ

09-08-2021 Mon 21:47
  • ఇటీవల సునీల్ యాదవ్ అరెస్ట్
  • కీలక అనుమానితుడిగా ఉన్న సునీల్
  • గత మూడ్రోజులుగా ఆయుధాల కోసం గాలింపు
  • గుర్రాలగడ్డ వంకలో రేపు ఉదయం మళ్లీ గాలింపు 
Viveka murder case probe continues
మాజీ ఎంపీ వైఎస్ వివేకాందనరెడ్డి హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం అన్వేషణ నేడు కూడా నిస్సారంగా ముగిసింది. మూడో రోజు అన్వేషణ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. పులివెందుల రోటరీపురం వాగు, గుర్రాలగడ్డ వంకలో ఆయుధాల కోసం సీబీఐ అధికారులు తీవ్ర గాలింపు జరిపారు. గత మూడు రోజులుగా అన్వేషణ జరుపుతున్నప్పటికీ ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. గుర్రాలగడ్డ వంకలో రేపు ఉదయం మళ్లీ గాలించాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు.

గత రెండు నెలలుగా వివేకా హత్యకేసును విచారిస్తున్న సీబీఐ... ఇటీవల కీలక అనుమానితుడు సునీల్ యాదవ్ ను గోవాలో అరెస్ట్ చేసింది. అతడిచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళుతోంది. అయితే ఆయుధాల కోసం గాలింపు చర్యలు రోజుల తరబడి కొనసాగుతుండడంతో దర్యాప్తు వేగం మందగించింది.