భారత్ చేరుకున్న అథ్లెట్ల బృందం... ఢిల్లీలోని అశోకా హోటల్ లో సన్మాన కార్యక్రమం

09-08-2021 Mon 19:41
  • ముగిసిన టోక్యో ఒలింపిక్స్
  • ఢిల్లీలో భారత అథ్లెట్లకు ఘనస్వాగతం
  • ఎయిర్ పోర్టులో క్రీడాకారులకు కరోనా టెస్టులు
  • హోటల్ అశోకాకు పయనమైన అథ్లెట్లు
Indian athletes gets rousing welcome in Delhi
టోక్యో ఒలింపిక్స్ నుంచి భారత అథ్లెట్ల బృందం తిరిగొచ్చింది. జావెలిన్ త్రో క్రీడలో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా సహా భారత అథ్లెట్లకు ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. క్రీడాభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. సాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) డైరెక్టర్ సందీప్ ప్రధాన్ ఎయిర్ పోర్టుకు వెళ్లి ఆటగాళ్లకు స్వాగతం పలికారు.

కాగా, ఎయిర్ పోర్టులో క్రీడాకారులకు కరోనా ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించారు. స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా అందరికంటే ముందు ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకున్నాడు. టెస్టులు పూర్తయిన అనంతరం క్రీడాకారులు ఢిల్లీలోని అశోకా హోటల్ కు చేరుకున్నారు. అక్కడ వారికి కేంద్ర ప్రభుత్వం సన్మాన ఏర్పాట్లు చేసింది.

ఈ కార్యక్రమం కోసం హోటల్ అశోకాను పువ్వులతోనూ, రంగురంగుల విద్యుద్దీపాలతోనూ అందంగా అలంకరించారు. ఎక్కడ చూసినా సందడి వాతావరణం ఉట్టిపడుతోంది. ఇక, నీరజ్ చోప్రాతో సెల్ఫీలకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు సైతం పోటీలు పడ్డాయి. మంత్రులు, వారి సిబ్బంది కూడా చోప్రాతో ఫొటోలకు ఆసక్తి చూపారు. వారే కాకుండా ఇతర అతిథులు కూడా పెద్దసంఖ్యలో సెల్ఫీలకు రావడంతో వారిని నియంత్రించడం భద్రతా సిబ్బందికి కష్టంగా మారింది.