మలయాళ రీమేక్ లో అంజలి!

09-08-2021 Mon 19:09
  • మలయాళ మూవీగా 'నాయాట్టు'
  • తెలుగు రీమేక్ కి సన్నాహాలు
  • కీలక పాత్రల్లో రావు  రమేశ్ .. సత్యదేవ్ 
  • దర్శకుడి విషయంలో రానున్న క్లారిటీ    
Anjali in Nayattu remake movie
ఈ మధ్య కాలంలో మలయాళం నుంచి ఎక్కువ సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చిన తరువాత మలయాళం నుంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తెలుగుకు వస్తున్నాయి. అలా ఈ మధ్య కాలంలో  మలయాళంలో వచ్చిన 'నాయాట్టు' సినిమాకి అక్కడ మంచి ఆదరణ లభించింది.

మార్టిన్ ప్రకట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథాకథనాల పరంగా అన్నివర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కథావస్తువు అన్ని ప్రాంతాలకు తగినదే. అందువలన రీమేక్ రైట్స్ కోసం గట్టిపోటీ ఏర్పడింది. హిందీ రీమేక్ రైట్స్ ను జాన్ అబ్రహం .. తమిళ రీమేక్ రైట్స్ ను గౌతమ్ మీనన్ దక్కించుకున్నారట.

ఇక తెలుగు రీమేక్ హక్కులను అల్లు అరవింద్ సొంతం చేసుకున్నట్టుగా చెబుతున్నారు. తెలుగులో ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించే పనిలో ఉన్నారట. ఆల్రెడీ అంజలి .. రావు రమేశ్ .. సత్యదేవ్ లను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏ దర్శకుడికి ఈ ప్రాజెక్టును అప్పగించనున్నారనే విషయంలోనే క్లారిటీ రావలసి ఉంది.