మాన్సాస్, సింహాచలం భూములపై విచారణకు ఆదేశించిన ఏపీ సర్కారు

09-08-2021 Mon 18:50
  • మాన్సాస్ అంశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
  • విజిలెన్స్ విచారణకు ఆదేశాలు
  • 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టీకరణ
  • ఇప్పటికే ప్రాథమిక నివేదిక సమర్పించిన కమిటీ
AP Govt orders vigilance and enforcement probe in Mansas and Simhachalam lands issue
మాన్సాస్, సింహాచలం ట్రస్టు భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నోడల్ ఆఫీసర్ గా దేవాదాయశాఖ కమిషనర్ ను నియమించింది. సింహాచలం దేవస్థానం ప్రాపర్టీ రిజిస్టర్ నుంచి భారీగా భూములు తొలగించినట్టు గుర్తించిన నేపథ్యంలో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించిన త్రిసభ్య కమిటీ ఇప్పటికే ప్రాథమిక నివేదిక అందించింది.

తాజా ఆదేశాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. త్రిసభ్య కమిటీ నివేదిక, సిఫారసుల మేరకే తాజా విచారణకు ఆదేశించామని, ఈ వ్యవహారంలో మరింత లోతైన విచారణ అవసరమని భావిస్తున్నామని తెలిపింది. అప్పటి ఈవో రామచంద్రమోహన్ పై ఇప్పటికే వేటు పడిందని, అధికారుల నివేదిక మేరకే చర్యలు తీసుకున్నామని వివరించింది. విజిలెన్స్ విచారణతో మరిన్ని వాస్తవాలు బయటికి వస్తాయని పేర్కొంది.