కాటేసిన పామును ముక్కలుగా కొరికి.. చివరకు ప్రాణం కోల్పోయాడు!

09-08-2021 Mon 18:03
  • బీహార్ నలంద జిల్లాలో ఘటన
  • ఆసుపత్రికి వెళ్లమని బతిమాలినా పట్టించుకోని వైనం
  • నిద్రలోనే ప్రాణం విడిచిన వ్యక్తి
Bihar man who bites snake finally dead
కోపంతో పామును ఓ వ్యక్తి ముక్కలుగా కొరికిన ఘటన బీహార్ నలంద జిల్లాలో చోటు చేసుకుంది. చివరకు ఆ వ్యక్తి ప్రాణం కోల్పోవడం అక్కడి ప్రజలను విషాదంలో ముంచెత్తింది. వివరాల్లోకి వెళ్తే... మాధోపూర్ గ్రామంలో 65 ఏళ్ల రామా మహతో నివసిస్తున్నాడు. శనివారం రాత్రి అతనిని ఒక పాము కాటేసింది. దీంతో కోపం పట్టలేకపోయిన ఆ వ్యక్తి... ఆ పామును వెంటాడి పట్టుకున్నాడు. దాన్ని కసితీరా కొరుకుతూ ముక్కలు చేశాడు.

అనంతరం చనిపోయిన పామును ఇంటి వద్ద ఉన్న చెట్టుకు వేలాడదీశాడు. దీన్ని గమనించిన గ్రామస్థులు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని ఎంతో బతిమాలారు. అయినప్పటికీ వారి మాటను ఆయన వినలేదు. భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. స్పృహ తప్పినట్టున్న ఆయనను తెల్లవారుజామున కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో, గ్రామంలో విషాదం నెలకొంది.