మహేశ్ .. త్రివిక్రమ్ కాంబో డీటేల్స్

09-08-2021 Mon 17:26
  • షూటింగు దశలో 'సర్కారువారి పాట'
  • నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో 
  • విషెస్ చెప్పిన హారిక హాసిని టీమ్
  • త్వరలోనే షూటింగు మొదలు  
Trivikram revealed new project details
మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'అతడు' .. 'ఖలేజా' సినిమాలు రావడం వలన, ఆ తరువాత రానున్న ఈ సినిమాపై సహజంగానే అంచనాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి ఎంతో సమయం లేదు. కెరియర్ పరంగా మహేశ్ బాబుకు ఇది 28వ సినిమా.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ రోజున మహేశ్ బాబు పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి అప్ డేట్ ఏదైనా వస్తుందేమోనని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే మేకర్స్ మహేశ్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమా డీటేల్స్ తో ఒక వీడియోను వదిలారు.

ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన నాయికగా పూజ హెగ్డే నటించనుంది. సంగీత దర్శకుడిగా తమన్ రంగంలోకి దిగుతున్నాడు. సినిమాటోగ్రఫర్ గా మథీ .. ఎడిటర్ గా నవీన్ నూలి పనిచేయనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం మహేశ్ చేస్తున్న 'సర్కారువారి పాట' షూటింగు పూర్తికాగానే, ఆయన ఈ ప్రాజెక్టుపైకి రానున్నాడు. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.