రైతుబంధు మాదిరే దళితబంధు కూడా దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది: మంత్రి హ‌రీశ్ రావు

09-08-2021 Mon 16:47
  • రెండున్నరేళ్లలో లక్ష కోట్లు ఖర్చు చేస్తాం
  • వచ్చే ఏడాదికి రూ. 30 వేల కోట్లు కేటాయించాలని ఆర్థికశాఖను ఆదేశించాం
  • ఇతర పథకాల స్ఫూర్తితో దళితబంధును అమలు చేస్తాం
Dalita Bandhu will be inspirational to entire country says Harish Rao
తెలంగాణలో దళితుల అభివృద్ధి కోసం రానున్న రెండున్నరేళ్లలో లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. చేర్యాలలో రూ. కోటి 25 లక్షలతో అంబేద్కర్ కమ్యూనిటీ భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ భవనానికి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ... భవన నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేశామని... మరో రూ. 75 లక్షలను కూడా విడుదల చేసి, అన్ని హంగులతో భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది దళితబంధు కోసం బడ్జెట్లో రూ. 30 వేల కోట్లను కేటాయించాలని ఆర్థికశాఖను ఇప్పటికే ఆదేశించామని హరీశ్ రావు తెలిపారు.

రైతుబంధు పథకం మాదిరే దళితబంధు కూడా దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఇతర పథకాలను విజయవంతంగా అమలు చేశామని... అదే స్ఫూర్తితో దళితబంధును కూడా అమలు చేస్తామని అన్నారు.