ఎంత కాకతాళీయం... ఒకే లొకేషన్లో నా సినిమా, నా కూతురి సినిమా!: అల్లు అర్జున్

09-08-2021 Mon 16:43
  • పుష్ప చిత్రంతో బిజీగా ఉన్న బన్నీ
  • శాకుంతలం చిత్రంలో నటిస్తున్న చిన్నారి అర్హ
  • ఇవాళ ఒకే లొకేషన్ లో రెండు సినిమాల షూటింగ్
  • కుమార్తె సెట్స్ పైకి వెళ్లిన అల్లు అర్జున్
Allu Arjun shares interesting thing on social media
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఆయన ముద్దుల తనయ అల్లు అర్హ గుణశేఖర్ శాకుంతలం చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేస్తోంది. శాకుంతలం చిత్రంలో అర్హ చిన్నారి భరతుడి పాత్ర పోషిస్తోంది.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఓ ఆసక్తికర అంశాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇవాళ తాను, తన కుమార్తె అర్హ ఒకే లోకేషన్ లో తమ చిత్రాల షూటింగ్ లో పాల్గొన్నామని వెల్లడించారు. పుష్ప, శాకుంతలం సినిమాలు ఒకే ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకున్నాయని తెలిపారు. దాంతో తాను తన కుమార్తె నటిస్తున్న సినిమా సెట్స్ వద్దకు వెళ్లానని బన్నీ వివరించారు.

"నేను, నా కూతురు ఒకే లోకేషన్ లో వేర్వేరు సినిమాల్లో షూటింగ్ చేశాం. ఇలాంటిది ఏదైనా జరుగుతుందంటే బహుశా అది ఏ 15-20 ఏళ్ల తర్వాతేనని అనుకునేవాడ్ని. కానీ అది ఇప్పుడే జరిగింది. శాకుంతంలో భరతుడ్ని పుష్ప కలిశాడు. యాదృచ్ఛికమే అయినా నిజంగా చిరస్మరణీయ క్షణాలు" అని వివరించారు.