Nandigam Suresh: దళితుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు: వైసీపీ ఎంపీ నందిగం సురేశ్

  • చంద్రబాబుపై ధ్వజమెత్తిన నందిగం సురేశ్
  • చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని వ్యాఖ్యలు
  • అమరావతి అభివృద్ధి ఎక్కడ జరిగిందన్న ఎంపీ
  • బినామీల కోసమే అమరావతి ఉద్యమం అని ఆరోపణ
YCP MP Nandigam Suresh slams TDP Supremo Chandrababu

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ తీవ్ర విమర్శలు చేశారు. దళితుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు. రాజకీయాల కోసమే చంద్రబాబు దళితులను అడ్డుపెట్టుకుంటారని విమర్శించారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందన్నట్టుగా చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.

దళితులు ఇంగ్లీషు మీడియంలో చదువుకోకూడదా? సొంత ఇంట్లో ఉండకూడదా? అని ఎంపీ ప్రశ్నించారు. 53 వేల మంది దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నారని వెల్లడించారు. అమరావతి ప్రాంతమంతా మురికివాడగా మారుతుందని చంద్రబాబు అన్నారని, దళితుల పట్ల ఆయనకున్న ప్రేమ ఏంటో దీన్నిబట్టే అర్థమవుతోందని నందిగం సురేశ్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు హయాంలో అమరావతి అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పాలని నిలదీశారు. అమరావతి ఉద్యమం ఎందుకు, ఎవరి కోసం చేస్తున్నారో చంద్రబాబుతో సహా అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. బినామీల ఆస్తులు రక్షించుకోవడానికే అమరావతిలో ఉద్యమం చేయిస్తున్నారని ఆరోపించారు.  చంద్రబాబు అన్ని వర్గాలను అవమానించారని, పేదల గురించి చంద్రబాబుకు మాట్లాడే హక్కులేదని స్పష్టం చేశారు. నాడు బషీర్ బాగ్ లో పేదలపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదని, ఇప్పుడు మళ్లీ పేదల కోసం మొసలి కన్నీరు కార్చుతున్నారని విమర్శించారు.

అమరావతిలో ఉన్న ఏ ఒక్క వ్యక్తికి సీఎం జగన్ అన్యాయం చేయరని నందిగం సురేశ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అన్ని ప్రాంతాల అభివృద్ధి అని వివరించారు.

More Telugu News