ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోదీ కూడా క్లారిఫికేషన్ అడిగారు: రఘురామకృష్ణరాజు

09-08-2021 Mon 15:27
  • ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది
  • రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూలుతుందో అని భయం వేస్తోంది
  • రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని రాష్ట్రపతికి లేఖ రాశానన్న రఘురాజు 
Modi asked for clarification on AP financial status says Raghu Rama Krishna Raju
ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని... ఈ విషయంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశానని చెప్పారు. ఇదే విషయంలో ప్రధాని మోదీ కూడా క్లారిఫికేషన్ అడిగారని అన్నారు. బడ్జెట్ అంచనాలకు మించి రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు ఉన్నాయని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 142 శాతం బడ్జెట్ అంచనాలకు మించి సర్కార్ అప్పులు చేసిందని అన్నారు.
 
ఏపీ అర్థిక వ్యవస్థ ఎప్పుడు కుప్పకూలుతుందో అని భయం వేస్తోందని రఘురాజు ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోనుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్న విధానం భయంకరంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కొత్త అప్పుల్లో... పాత అప్పులపై వడ్డీ చెల్లించడానికే 42 శాతం సరిపోతుందని అన్నారు.

ఇలాంటి దారుణమైన ఆర్థిక పరిస్థితి రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేదని చెప్పారు. జులైలో రెండో వారం వచ్చేంత వరకు కూడా ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లించలేకపోయారని విమర్శించారు. ఏపీలో కేంద్రం వెంటనే ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశానని చెప్పారు.