మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించిన ఊర్మిళ గజపతిరాజు

09-08-2021 Mon 15:20
  • మరోసారి కోర్టుకెక్కిన మాన్సాస్ వ్యవహారం
  • చైర్మన్ పదవి తనకు ఇవ్వాలన్న ఊర్మిళ
  • తనకూ హక్కు ఉందని ఉద్ఘాటన
  • విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
Urmila Gajapathi Raju files petition in AP High Court
మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో త్రిముఖ పోరు నెలకొన్నట్టు కనిపిస్తోంది. మాన్సాస్ ట్రస్టుపై ఆధిపత్యం కోసం అశోక్ గజపతిరాజు, ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయిత హోరాహోరీ పోరాటం చేయడం తెలిసిందే. ఈ క్రమంలో, ఊర్మిళ గజపతిరాజు మాన్సాస్ ట్రస్టు అంశంలో హైకోర్టును ఆశ్రయించారు. ఊర్మిళ... ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె.

మాన్సాస్ ట్రస్టు చైర్మన్ విషయంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఆమె అప్పీల్ చేశారు. అశోక్ గజపతిరాజును చైర్మన్ గా కొనసాగిస్తూ ఇటీవల సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇవ్వడం తెలిసిందే.

మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా తనను నియమించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె తన న్యాయవాది ద్వారా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఊర్మిళ మాన్సాస్ ట్రస్టుకు వారసురాలేనని ఆమె తరఫు న్యాయవాది విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.