USA: అమెరికాలోని ఆ నగరంలో దారుణంగా పెరిగిపోతున్న ‘డెల్టా’ కేసులు!

  • 313 వెంటిలేటర్లే ఖాళీ
  • 600% పెరిగిన ఆసుపత్రి చేరికలు
  • ఐసీయూల్లో రోగులు 570% పెరుగుదల
  • మున్ముందు పది రెట్లయ్యే ముప్పుందన్న అధికారులు
US City Sees Very High Spurt In Covid Delta Cases Has Only 6 ICU Beds Left

అమెరికాలో కరోనా ‘డెల్టా’ వేరియంట్ ఎంతలా విజృంభిస్తోందో చెప్పేందుకు నిదర్శనమీ ఘటన. టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా 24 లక్షల మంది జనాభాకు.. ప్రస్తుతం ఆ సిటీలో మిగిలింది కేవలం 6 ఐసీయూ బెడ్లే. 313 వెంటిలేటర్లే ఖాళీగా ఉన్నాయి. అవును, అక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉందని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముప్పు తీవ్రతను ‘స్టేజ్ 5’గా ప్రకటించిన రెండు రోజులకే ఈ పరిస్థితి తలెత్తడం గమనార్హం.

నగరంలోని ఆసుపత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోతున్నాయని, మౌలిక వసతులపై బాగా ఒత్తిడి పడుతోందని పబ్లిక్ హెల్త్ మెడికల్ డైరెక్టర్ డెస్మార్ వాక్స్ చెప్పారు. స్థానికులందరికీ బెడ్లు, ఆసుపత్రుల్లో పరిస్థితులకు సంబంధించిన వివరాలను మెసేజ్ లు, ఫోన్ల ద్వారా తెలియజేశామన్నారు. గత నెలతో పోలిస్తే ఇప్పుడు ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య 600 శాతానికి పెరిగిందన్నారు. అదే ఐసీయూల్లో చేరిన వారి సంఖ్య 570 శాతం ఎక్కువైందన్నారు. వెంటిలేటర్ పై ఉన్న కరోనా పేషెంట్ల సంఖ్య 102 శాతానికి పెరిగిందన్నారు. మున్ముందు ఈ సంఖ్య 10 రెట్లు పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు.

ఇక, టెక్సాస్ రాష్ట్రవ్యాప్తంగా 2.9 కోట్ల జనాభా ఉండగా.. కేవలం 439 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. 6,991 వెంటిలేటర్లు ఖాళీగా ఉన్నాయి. 67 లక్షల జనాభా ఉన్న హ్యూస్టన్ లో కేవలం 41 ఐసీయూ బెడ్లు, 80 లక్షలకు పైగా జనాభా ఉన్న డల్లాస్ లో 110 మాత్రమే ఉన్నాయి. కాగా, ఇటు అమెరికా వ్యాప్తంగా కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. రోజూ సగటున లక్షకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. రెండు రోజుల క్రితం ఒక్కరోజే రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కాగా, ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంటోనీ ఫౌచీ అన్నారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో టెక్సాస్, ఫ్లోరిడాల్లోనే 40 శాతంపైన ఉంటున్నాయని చెప్పారు.

More Telugu News