నలుగురు ఐఏఎస్ లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

09-08-2021 Mon 15:01
  • కర్నూలు జిల్లాలోని ఓ స్కూలు ఆవరణలో నిర్మాణాలు
  • నిలిపివేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు
  • తమ ఆదేశాలు ఎందుకు పాటించలేదన్న కోర్టు
  • ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
AP High Court furious on four IAS officers
ఏపీ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, శ్రీలక్ష్మి, విజయ్ కుమార్, గిరిజాశంకర్ లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ స్కూలు ఆవరణలో భవనాలు నిర్మించవద్దని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించలేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పాఠశాల భూముల్లో రైతు భరోసా, పంచాయతీయ భవనాలు, గ్రామ సచివాలయ భవన నిర్మాణాలపై తాము ఆదేశాలు ఇచ్చినా ఎందుకు అమలు చేయడంలేదని వారిని నిలదీసింది.

తాము ఉత్తర్వులు ఇచ్చినా నిర్మాణాలు కొనసాగడమేంటని న్యాయమూర్తి ఆగ్రహం వెలిబుచ్చారు. అసలు, పాఠశాల ఆవరణలోకి రాజకీయాలను తీసుకెళ్లడం తగునా? అని నిలదీసింది. మీలో ఎవరైనా ఇటువంటి పాఠశాలల్లో చదువుకున్నారా? అని ప్రశ్నించింది.

కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాల ఆవరణలో భవనాల నిర్మాణం చేపట్టడంపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ కొనసాగించింది. తమ ఆదేశాలను అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం జరిగిందని ప్రశ్నించింది. ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తదుపరి విచారణకు నలుగురు ఐఏఎస్ లు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. అనంతరం విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది .