తప్పు చేయలేదన్నారుగా.. మరి, భయమెందుకు?: అమెజాన్​, ఫ్లిప్​ కార్ట్​ లకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

09-08-2021 Mon 14:49
  • అవిశ్వాస విచారణను ఎదుర్కోవాల్సిందేనన్న జస్టిస్ రమణ
  • పెద్ద సంస్థలు పారదర్శకత కోసం ముందుకు రావాలని కామెంట్
  • విచారణకు హాజరయ్యేందుకు నాలుగు వారాల గడువు
Supreme Court Asked Amazon and Flipkart To Face Inquiry
ఈ–కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అవిశ్వాస విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఆయా సంస్థలకు కోర్టు తేల్చి చెప్పింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తును నిలుపుదల చేయాలని కోరుతూ సదరు సంస్థలు వేసిన పిటిషన్ ను సుప్రీం తోసిపుచ్చింది. ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సంస్థల పిటిషన్ ను విచారించింది.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఇలాంటి విచారణలు, పారదర్శకతకు స్వచ్ఛందంగా సహకరిస్తాయనుకుంటున్నామని జస్టిస్ రమణ అన్నారు. కానీ, మీరేమో అసలు విచారణే వద్దంటున్నారని కాస్తంత అసహనం వ్యక్తం చేశారు. ‘‘సీసీఐ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మీరు చెబుతున్నారు. ఏ తప్పూ చేయలేదంటున్నారు. అలాంటప్పుడు భయమెందుకు? విచారణను ఎదుర్కోవాల్సిందే’’ అని తేల్చి చెప్పారు. సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లకు విచారణార్హత లేదని పేర్కొన్న ఆయన.. వాటిని కొట్టేశారు. నాలుగు వారాల్లోగా సీసీఐ విచారణకు హాజరు కావాలని సంస్థలకు ఆదేశాలిచ్చారు.

కాగా, కేవలం ఎంపిక చేసిన సెల్లర్లకే రెండు సంస్థల్లో వ్యాపారాలకు అవకాశం ఇస్తున్నారని, దాని వల్ల పోటీలేకుండా చేసుకుంటున్నారని ఆరోపిస్తూ సీసీఐ గత ఏడాది దర్యాప్తునకు ఆదేశించింది. అయితే, ఆ ఆరోపణలను తోసిపుచ్చిన సంస్థలు.. కర్ణాటక హైకోర్టులో వ్యాజ్యాలు వేశాయి. వాటిని హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వాటిని నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది.