Schools: బడులను తెరవాల్సిందే.. ఇంకా మూసి ఉంచితేనే మరింత ప్రమాదం: తేల్చి చెప్పిన పార్లమెంట్​ పానెల్​

Parliamentary Panel Recommends To Re Open Schools
  • పార్లమెంట్ కు నివేదిక సమర్పణ
  • పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం
  • ఇప్పటికే దెబ్బతిన్న చదువులు
  • పేద, గ్రామీణ విద్యార్థులకు తీవ్ర నష్టం
  • స్కూళ్లను తెరిచేందుకు పలు సూచనలు
కరోనా మహమ్మారితో ఏడాదిన్నరగా బడులు, కళాశాలలన్నీ మూతపడిపోయాయి. చదువులన్నీ అటకెక్కాయి. ఆన్ లైన్ బోధన జరుగుతున్నా చాలా మంది చిన్నారులు, విద్యార్థులకు అవి బుర్రకెక్కడం లేదు. దానికి తోడు పరీక్షల్లేకుండానే టెన్త్, ఇంటర్ విద్యార్థులను బోర్డులు పాస్ చేసేశాయి. అయితే, ఇక బడులు తెరవాల్సిందేనని ‘విద్య, మహిళలు, చిన్నారులు, యువత, క్రీడల పార్లమెంటరీ పానెల్’ తేల్చి చెబుతోంది. భౌతిక తరగతులను నిర్వహించకుండా బడులను ఇంకా మూసి ఉంచితేనే మరింత ప్రమాదమని అభిప్రాయపడింది. వినయ్ పి. సహస్రబుద్ధ నేతృత్వంలోని పానెల్.. దానికి సంబంధించిన నివేదికను పార్లమెంట్ కు సమర్పించింది.

బడులను తెరిస్తే విద్యార్థులకే మంచిదని పేర్కొంది. పాఠశాలలను మూసేయడం వల్ల చాలా కుటుంబాలపై సామాజికంగా దెబ్బపడిందని, పిల్లలు ఇంటి పనులు చేస్తున్నారని చెప్పింది. ఏడాదిన్నరగా ఇంట్లోనే ఉండడం, ఆన్ లైన్ క్లాసులు వింటుండడం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యంపై పెను ప్రభావం పడిందని ఆందోళన వ్యక్తం చేసింది. నాలుగు గోడల మధ్య బందీ కావడంతో తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధంపై చెడు ప్రభావాన్ని చూపిస్తోందని తెలిపింది.

స్కూళ్లను మూసేయడం పేద, గ్రామీణ విద్యార్థులు, ఆడపిల్లలపై పెను ప్రభావానికి గురి చేసిందని పానెల్ ఆవేదన వ్యక్తం చేసింది. వారి చదువులు దెబ్బ తింటున్నాయని పేర్కొంది. అన్ని విషయాలనూ దృష్టిలో పెట్టుకుని స్కూళ్లను తెరవాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. స్కూళ్లను తెరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించింది.


ఇవీ సూచనలు

  • విద్యార్థులు, ఉపాధ్యాయులు, సంబంధిత సిబ్బంది అందరికీ కరోనా వ్యాక్సిన్లను వేగంగా వేయాలి. తద్వారా బడులను తెరిచేందుకు వీలవుతుంది.
  • తరగతుల్లో ఎక్కువ మంది విద్యార్థుల్లేకుండా ఉండేందుకు రోజు తప్పించి రోజు లేదా రెండు షిఫ్టుల్లో తరగతులను నిర్వహించాలి.
  • మాస్కులను ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులను కడుక్కోవడం వంటి కనీస నిబంధనలను తుచ తప్పకుండా పాటించాలి.
  • హాజరు తీసుకునే సమయంలో ప్రతి విద్యార్థి శరీర ఉష్ణోగ్రతను పరిశీలించాలి.
  • విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి ర్యాండమ్ గా కరోనా టెస్టులను (ఆర్టీపీసీఆర్) చేయాలి.
  • ప్రతి స్కూల్ లో కనీసం రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఏర్పాటు చేయాలి. ఆపద సమయంలో దానిని ఆపరేట్ చేసేందుకు, ప్రథమ చికిత్స చేసేందుకు సుశిక్షితుడిని నియమించాలి.
Schools
COVID19
Parliament
Parliamentary Panel

More Telugu News